Telugu Updates
Logo
Natyam ad

తెలంగాణ ఎంసెట్ అప్డేట్.. అగ్రికల్చర్ పరీక్ష వాయిదా

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్ పరీక్ష నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నందున రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి తెలిపారు. ఈనెల 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అగ్రికల్చర్ పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ఎంసెట్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎంసెట్ ఈనెల 14వ తేదీ నుంచి మొదలవుతుందా? లేదా? అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఈనెల 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వంతో సంప్రదించి అగ్రికల్చర్ పరీక్ష వాయిదా వేసి.. ఇంజినీరింగ్ పరీక్షను యథాతథంగా జరపాలని నిర్ణయించారు.