Telugu Updates
Logo
Natyam ad

టిమ్స్ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ భూమి పూజ

హైదరాబాద్: జీహెచ్ఎంసీకి నలుమూలలా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లోని అల్వాల్, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ మంగళవారం భూమి పూజ చేశారు. మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కో ఆస్పత్రిని 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. గడ్డి అన్నారం ఆస్పత్రికి రూ.900 కోట్లు, అల్వాల్కు రూ.897 కోట్లు, ఎర్రగడ్డ ఆస్పత్రికి రూ.882 కోట్లు కేటాయించారు. ఈ మేరకు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ జీవో విడుదల చేసింది. అల్వాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 28.41 ఎకరాల స్థలాన్ని కేటాయించగా.. ఇందులో జీ ప్లస్ 5 అంతస్తులు నిర్మిస్తారు. గడ్డి అన్నారం ఆసుపత్రికి 21.36 ఎకరాలు కేటాయించగా.. జీ ప్లస్ 14 అంతస్తులు నిర్మించనున్నారు. ఎర్రగడ్డ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 17 ఎకరాలు కేటాయించగా.. ఇక్కడ జీ ప్లస్ 14 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారని వైద్యవర్గాలు తెలిపాయి..

ఈ ఆస్పత్రుల్లో అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు లభిస్తాయి. ఒక్కో ఆస్పత్రిని 1,000 పడకలతో నిర్మించనునున్నారు. వైద్య విద్య కోసం పీజీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలు కూడా అందుబాటులోకి వస్తాయి. అల్వాల్లో ఏర్పాటు చేసే ఆస్పత్రితో సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే రోగులకు.. ఎల్బీనగర్ (గడ్డి అన్నారం) ఆస్పత్రి ద్వారా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల వారికి.. గచ్చిబౌలి, సనత్నగర్ ఆస్పత్రులతో సమీప జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి..