Telugu Updates
Logo
Natyam ad

ఇక టార్గెట్‌ తెలంగాణ..!

  • బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి..
  • వచ్చే నెలలో రాష్ట్రానికి అమిత్‌ షా
  • కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అసంతృప్తులపై నజర్‌

హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల్లో సాధించిన అద్భుత ఫలితాల ఉత్సాహంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఇక తెలంగాణను టార్గెట్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టేందుకు సమాయత్తం అవుతోంది. ‘ఇక మా ఫోకస్‌ తెలుగు రాష్ట్రాలపైనే ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకువెళ్తాం’ అంటూ కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ గురువారం చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేసీఆర్‌ ఫ్రంట్‌ రాజకీయాలకు తెరపడినట్టేనని భావిస్తున్నాం. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీల్లోని అసంతృప్త నేతలు మావైపు రావడం ఖాయం’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు వివరించారు. సంస్థాగత బలోపేతంపై దృష్టి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండోదశ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 14న జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించనున్నారు. దీని ప్రారంభ సమావేశానికి అమిత్‌ షా హాజరయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజు వీలుకాకపోతే ఏదో ఒకరోజు పాదయాత్రలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది.

అలాగే, జనగామలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అమిత్‌షా హాజరవుతారని సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా రాష్ట్రానికి వచ్చి వివిధ పథకాల అమలుపై సమీక్షించనున్నారని పేర్కొన్నాయి. సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాశ్‌ ఇటీవల రెండు రోజుల పాటు పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాలతో సుదీర్ఘంగా సమీక్షించారు. బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో తక్షణం దృష్టి సారించాలని ఆయన నిర్దేశించారని పార్టీ వర్గాలు వివరించాయి. అలాగే, రెండురోజుల క్రితం మరోసారి పార్టీ జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాశ్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చి కొంతమంది సీనియర్‌ నాయకులతో అంతర్గతంగా సమావేశమైనట్లు సమాచారం. ఈసందర్భంగా టీఆర్‌ఎస్‌ పాలన తీరుపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది..