Telugu Updates
Logo
Natyam ad

ఈ పానీయాలతో వేసవిలోనూ హుషారుగా!

మండే ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి బోలెడు సహజ సిద్ధమార్గాలున్నాయి..

అందులో ఒకటి చల్లటి పానీయాలు తీసుకోవడం. ఇవి దాహార్తి తీర్చడంతోపాటు శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చూస్తాయి.

అందరికీ అందుబాటులో ఉండే ఆ రసాలు//పానీయాలు ఏంటో చూద్దామా..

మజ్జిగ…

దీంట్లో ప్రొటీన్లు, క్యాల్షియం, విటమిన్ బి12 మెండుగా ఉంటాయి. కప్పు పెరుగులో రెండు కప్పుల నీళ్లు పోసి తగినంత జీలకర్ర పొడి, నల్లుప్పు, చిటికెడు ఉప్పు వేసి బాగా గిలక్కొట్టి తాగితే సరి. రుచికరమైన మజ్జిగ సిద్ధం. దీన్ని తరచూ తాగుతూ ఉంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. శక్తి కోల్పోకుండా ఉంటారు.

సత్తు డ్రింక్…

ఇదొక చల్లటి సంపూర్ణ పానీయం. దీంట్లో ప్రొటీన్లు, క్యాల్షియం, ఐరన్ దండిగా ఉంటాయి. రోజూ ఈ పానీయాన్ని తాగితే ఉత్సాహంగా ఉంటారు. వేయించిన శనగల పిండినే సత్తుగా పిలుస్తారు. గ్లాసు నీటిలో రెండు చెంచాల సత్తు పిండి, చెంచా చక్కెర, రెండు చిటికెల జీలకర్ర పొడి వేసి, కొద్దిగా నిమ్మరసం పిండి, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. అంతే సత్తు డ్రింక్ సిద్ధం. దీంట్లో పుదీనా ఆకులు వేసి తాగితే ఆహా అనకుండా ఉండలేరు. దీన్ని తీపిగా కాకుండా ఉప్పు వేసి కూడా చేసుకోవచ్చు. అధిక వేడిమి నుంచి ఈ జ్యూస్ చల్లదనాన్ని అందిస్తుంది. తాగితే రోజంతా శరీరం తాజాగా ఉంటుంది. ఇది ఆకలిని కూడా కలిగిస్తుంది.

ఆమ్ పన్నా…

మామిడికాయను ఉడికించి ఆ రసంలో చల్లటి నీళ్లను కలిపి. కాస్తంత జీలకర్ర పొడి, ఉపగ్ర వేసి దీన్ని తయారు చేసుకోవాలి. ఇది శరీరానికి చలువ చేస్తుంది. కావాలనుకుంటే చక్కెరా వేసుకోవచ్చు. దీంట్లో బోలెడు ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి.

వెలగపండు జ్యూస్…

ఈ పండు గుజ్జులో విత్తనాలను తీసేయాలి. ఇందులో చల్లని నీళ్లు పోసి చేత్తో రసం తీయాలి లేదా మిక్సీ పట్టాలి. ఈ రసాన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు మరికొన్ని నీళ్లు కలిపి చిక్కటి ద్రవంలా చేసుకోవాలి. కావాలనుకుంటే చక్కెర వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సహజంగానే తియ్యగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓ పెద్ద పాత్రలో పోసి, ఐసు ముక్కలు, పుదీనా ఆకులు వేసి మరికొన్ని నీళ్లు కలిపి గ్లాసుల్లో పోసి సర్వ్ చేసుకుంటే తియ్యతియ్యటి పోషకాల వెలగపండు జ్యూస్ రెడీ. పండు అందుబాటులో లేకపోతే దీని సిరప్ బజారులో దొరుకుతుంది. ఈ సిరపన్ను చల్లని నీళ్లలో కలిపి తీసుకుంటే చాలు. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. వీటితోపాటు నిమ్మరసం నీళ్లు, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం… ఇవీ మేలు చేసేవే..