Telugu Updates
Logo
Natyam ad

పాఠశాలలో పాముల పుట్ట.. పట్టించుకోండి సారు.!

భయం భయంగా బడికి వెళ్తున్న విద్యార్థులు

అసంపూర్తిగా పాఠశాల భవనం

గదుల్లో సిమెంటు గచ్చు లేక చాపపై కూర్చొని విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు

ఆంజనేయులు న్యూస్, తిర్యాణి: కొమరం భీమ్ జిల్లా తిర్యాణి మండలంలోని ముల్కలమంద గ్రామ పంచాయతీ తోయరేటి గిరిజన ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిలో పాముల పుట్ట ఉంది. దీంతో విద్యార్థులు భయం భయంగా బడికి వెళ్తూ చదువుకోవాల్సి వస్తోంది. గదుల్లో సిమెంటు గచ్చు నిర్మించకపోవడంతో నేలపైనే ఓ చాపపై కూర్చొని విద్యనభ్యసిస్తున్నారు. బందరాఘాట్, తోయరేటి, ఇప్పగూడ చెందిన 11 మంది గిరిజన విద్యార్థులు.. 1- 3వ తరగతి వరకు చదువుకుంటున్నారు. 17 ఏళ్ల కిందట రూ.5 లక్షలతో ఈ పాఠశాల భవన నిర్మాణం ప్రారంభించగా.. ఇప్పటి వరకు సిమెంటుతో గోడలకు పూతలు లేక నేలపై గచ్చు వేయక, తలుపులు, కిటీకీలు, విద్యుత్తు సౌకర్యం కల్పించలేదు. దీంతోపాటు రెగ్యూలర్ ఉపాధ్యాయుడిని కూడా నియమించకపోవడంతో.. సీఆర్టీతో బడి కొనసాగుతోంది. ఈ విషయంపై రొంపల్లి ఎస్ఈఆర్పీ వెడ్మ యశ్వంత్ ను “ఆంజనేయులు న్యూస్” వివరణ కోరగా.. సమస్యపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లినట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఈ బడి ఎంపికై రూ.2.15 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఈ నిధులు సరిపోవని మహిళా సంఘాల సభ్యులు ముందుకు రాలేదని సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి భవనాన్ని పూర్తి చేసి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, మా బడిని పట్టించుకోండి సారు.! అని గ్రామీణ వాసులు కోరుతున్నారు.