నిరుద్యోగుల నుంచి డబ్బు తీసుకుంటూ ఫొటో దిగిన విజయభారతి
కి’లేడీ’.. ఎస్ఐ వేషం వేసి రూ.లక్షల్లో మోసం
ఉద్యోగాల పేరిట యువతకు గాలం
ముంపు బాధితులనూ వదలని వైనం
పోలీసులు అదుపులో నిందితురాలు
సిద్దిపేట జిల్లా: ప్రతిభ కలిగిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్గా ప్రచారం… ఉద్యోగాల పేరిట యువకులకు గాలం.. రూ. లక్షల్లో వసూళ్లు.. చివరికి అందరికీ కుచ్చుటోపీ! ఇదంతా ఓ కి’లేడీ’ ఆడిన నాటకం.. 2021 డిసెంబరులో సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు పోలీసుశాఖలో ఉద్యోగానికి ఆశపడి ఎస్ఐగా పరిచయమైన మహిళకు రూ.10లక్షలు ముట్టజెప్పాడు. తరువాత ఆమె నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆమె నాలుగు రోజుల కిందట పోలీసులకు పట్టుబడింది. విచారణలో ఆమె సిద్దిపేట సహా ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో పదుల సంఖ్యలో యువకులను మోసగించినట్లు తేలింది.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు సిద్దిపేట గ్రామీణ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామానికి చెందిన విజయభారతి డిగ్రీ పూర్తిచేసింది. 2018లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నా ఎంపిక కాలేదు. గతంలో మహబూబాబాద్కు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. రూ.13లక్షల వరకు అప్పులు తెచ్చి అతగాడికి ముట్టజెప్పి మోసపోయింది. ఆ అప్పులు తీర్చేందుకు ఎస్ఐ అవతారమెత్తింది. ఎస్ఐ పరీక్షలకు సంబంధించి నకిలీ ఫలితాలు, ధ్రువపత్రాలు సృష్టించింది. ఎస్ఐగా ఎంపికయినట్టు నమ్మించి ప్రముఖులతో సత్కారాలు అందుకొంది. ఆ ఫొటోలను చూపిస్తూ పోలీసు శాఖలో, సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని ఉచ్చులోకి దింపింది. నారాయణరావుపేటకు చెందిన ఓ యువకుడి నుంచి రూ.10లక్షలు గుంజింది. అతని ద్వారా మల్లన్నసాగర్ ముంపునకు గురైన పలువురు బాధితుల నుంచి బాండ్పేపర్ రాయించుకొని రూ. లక్షలు తీసుకుంది. ఎస్ఐని అంటూ వరంగలకు చెందిన ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకుంది. వారికిపుడు నాలుగు నెలలు సాంకేతికతతో మాయచేసి…
హైదరాబాద్ చైతన్యపురిలో ఉంటూ యాభై మంది నుంచి రూ.70లక్షల వరకు వసూలు చేసింది. నెలల పాటు టవర్ లోకేషన్ తెలియనీయకుండా సాంకేతికత ఆధారంగా పక్కదారి పట్టించింది. ఈ క్రమంలో సీఐ జానకిరాంరెడ్డి, ఎస్ఐ అమరేందర్ విచారణ ముమ్మరం చేశారు. భర్తను పట్టుకొని అతనితో ఫోన్ చేయించగా హుస్నాబాద్ లో ఉన్నట్టు తెలియగానే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు..