హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెరాస, భాజపా దీక్షలపై ట్విటర్ వేదికగా రేవంత్ విమర్శలు గుప్పించారు. కష్టం చేసిన రైతులు.. దళారుల చేతుల్లో దగాపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలో తెరాస, గల్లీలో భాజపా.. దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ రెండు పార్టీలకు అన్నదాతలే రాజకీయ సమాధి కడతారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న దోపిడీని గ్రామాల్లో సభలు పెట్టి బయటపెట్టామని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని రేవంత్ తెలిపారు.