Telugu Updates
Logo
Natyam ad

పకడ్బంధీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్,

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: లోక్సభ ఎన్నికలు-2024లో భాగంగా ఈ నెల 13న జరిగిన పోలింగ్ కు సంబంధించి జూన్ 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ పరిశీలకులు విజయ ఈ రవికుమార్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), 003-బెల్లంపల్లి (ఎస్.సి.), అసెంబీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి బి.రాహుల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి, 004-మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి వి. రాములు, ప్రత్యేక ఉప పాలనాధికారి (ఎల్.ఎ., ఆర్&ఆర్), 002-చెన్నూర్ (ఎస్.సి.) అసెంబీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి డి.చంద్రకళతో కలిసి కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులకు ఏర్పాటు చేసిన 2వ విడత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ.. 002-పెద్దపల్లి (ఎస్.సి.) పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ నెల 13న జరిగిన పోలింగ్ కు సంబంధిత జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో జరిగే ప్రతి అంశం భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నిర్వహించవలసి ఉంటుందని, జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోనికి సరైన అనుమతి లేని వారిని, మొబైల్ ఫోన్లను అనుమతించరాదని తెలిపారు. విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బందికి జారీ చేసిన అనుమతి పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, జూన్ 4వ తేదీన ఉదయం 8 గం||లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ఉదయం 7.30 గం॥ల లోపు అధికారులు, సిబ్బంది హాజరు కావాలని తెలిపారు. లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయిన వెంటనే 17సి ప్రకారం కంట్రోల్ యూనిట్ లో పోలైన ఓట్లను సరి చూసుకోవాలని, సరిగా లేనట్లయితే సహాయ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

లెక్కింపు సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థికి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్ లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలని తెలిపారు. వి.వి. ప్యాట్ కౌంటింగ్ బూత్ లో ఏదైనా 5 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి లెక్కింపు జరుగుతుందని తెలిపారు. లెక్కింపు సమయంలో వెలువరించే ఫలితాల వివరాలను సూక్ష్మ పరిశీలకులు, పర్యవేక్షకులు ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా నమోదు చేసుకోవాలని, కౌంటింగ్ సమయంలో క్రమశిక్షణ పాటించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు హాజరయ్యే ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఓ.ఆర్.ఎస్., వైద్య సిబ్బంది, అవసరమైన మందులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ఇతరత్రా ప్రతి అంశంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సి.సి. కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.