రక్తహీనతతో సర్కారు ఆసుపత్రికి వచ్చేవారు యాతన పడుతున్న వైనం
ఓవైపు తలసీమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్థులు, మరోవైపు గర్భిణులకు ఇబ్బంది
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సొసైటీ సభ్యుల వ్యవహారం
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలోని రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో నిల్వల కొరత బాధితులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ఓవైపు తలసీమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్థులు.. మరోవైపు గర్భిణులు, రక్తహీనతతో సర్కారు ఆసుపత్రికి వచ్చేవారు యాతన పడుతున్నారు. నెగెటివ్ గ్రూపులకు చెందిన రక్తం నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఈ కొరతతో సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసరమైతే బాధితులే దాతలను వెంట తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. ఇవేం పట్టనట్లు ‘ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సొసైటీ సభ్యులు వ్యవహరిస్తున్నారు. కలిసికట్టుగా పనిచేస్తూ కేంద్రం అభివృద్ధి.. బాధితులకు మెరుగైన సేవలు అందించాల్సింది పోయి వ్యక్తిగత ప్రచారం కోసం పరితపిస్తున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఏ కార్యక్రమం చేపట్టినా ఇటీవల ఎన్నికైన 15మంది సభ్యుల పాత్ర కీలకంగా ఉంటుంది. సమష్టి నిర్ణయంతో కలిసికట్టుగా ముందుకెళ్లాలి. కానీ వారు అలా వ్యవహరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో కమిటీపై ఆరోపణలు వస్తున్నాయి. స్వచ్చంద సంస్థకు ఎన్నికలు నిర్వహించే స్థాయికి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన నూతన కమిటీ ఎన్నికలు రాజకీయ పార్టీ ఎన్నికలను తలపించాయి. రాష్ట్రంలో గవర్నర్, జిల్లాలో పాలనాధికారి పెద్దదిక్కుగా ఉంటూ నిర్వహించే ఈ రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలు సక్రమంగా కొనసాగాలంటే ఈ సభ్యుల తీరుమారాల్సి ఉంది.
• సమష్టితత్వం లోపించడంతో అధికారుల్లోనూ స్పందన కరువు
రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు సమాజంలో సేవా దృక్పథం కలవారిగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కొందరు సభ్యులు సమయం, సందర్భం లేకుండా కమిటీకి సమాచారం ఇవ్వకుండా జిల్లా అధికారులను కలుస్తూ వారిని ఇబ్బందులకు గుర్తిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరిగా ఓ శాలువ, శిబిరం నిర్వహించాలని ఓ వినతిపత్రం చేతపట్టుకుని వెళ్లడం రావడం తప్పితే సంస్థ కోసం పని చేయడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. సమష్టితత్వం లోపించడంతో అధికారుల్లోనూ స్పందన కరవైంది.
• దాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నా సొసైటి సభ్యులు
సాధారణంగా శిబిరాల కోసం దాతలను కలుస్తూ నిర్వహణకు సభ్యులు కృషి చేయాలి. తగిన ఏర్పాట్లు చేసి విజయవంతం చేసేందుకు పరోక్షంగా సహకారం అందించాలి. అంతేకానీ రక్తదాన శిబిరాలు జరుగుతున్న సమయంలోనూ సొసైటీ సభ్యులు దాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇక్కడ టెక్నీషియన్లు ఉంటే సరిపోతుంది. కానీ వీరు ఫొటోలంటూ సమయం వృథాతో పాటు ఎక్కడ శిబిరం జరిగినా అవసరం లేకపోయినా వెళ్లడం పలువురు రవాణా, భోజనాలకు డబ్బులు సైతం కేంద్రం నుంచే తీసుకోవడం విడ్డూరంగా ఉంటుందని ఇక్కడి సిబ్బందితో పాటు తోటి సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.