రూ.640 కోట్లు వసూలు చేసిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్: ఆస్తిపన్నుపై 5శాతం రాయితీ పొందే ఎర్లీబర్డ్ పథకం నేటితో ముగియనుందని జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి శుక్రవారం రాత్రి వరకు రూ.640 కోట్ల పన్ను వసూలైంది. 66వేల మంది అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. మిగిలిన వారూ పూర్తి పన్ను చెల్లించి రాయితీ పొందొచ్చని, శనివారం అర్ధరాత్రి వరకు ఆన్లైన్ లో పన్ను చెల్లించవచ్చని జీహెచ్ఎంసీ సూచించింది. ప్రజల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలు రాత్రి 10గంటల వరకు కొనసాగనున్నాయి. ఖజానాకు చేరిన పన్నులో డిజిటల్ చెల్లింపులది అగ్రస్థానం. శుక్రవారం చాలామందికి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ పథకం మొదలైనప్పట్నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ పన్ను వసూలవడం గమనార్హం..