Telugu Updates
Logo
Natyam ad

రేపు హైదరాబాదు కు ప్రధాని మోదీ..!

ఐఎస్ బీలో 2వేల మంది పోలీసుల మోహరింపు

హైదరాబాద్: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26న నిర్వహించే ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకొని.. హెలికాప్టర్ లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ) ఆవరణలో దిగుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గచ్చిబౌలిలోని ఐఎస్బీకి చేరుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఐఎస్బీతోపాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్సీయూలలో భారీ ఎత్తున పోలీసులను హరిస్తున్నారు. ఒక్క ఐఎస్బీలోనే 2వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సైబరాబాద్ ఇన్ఛార్జి కమిషనర్ సీవీ ఆనంద్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం నుంచే ఈ ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

విద్యార్థుల సామాజిక మాధ్యమాల ఖాతాల తనిఖీ..

ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవాల్లో హైదరాబాద్, మొహాలీ ప్రాంగణాలకు చెందిన దాదాపు 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా అపశ్రుతులు దొర్లకుండా విద్యార్థుల సామాజిక మాధ్యమాలను తనిఖీ చేసి, ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక భావాలు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని చేతులమీదుగా పట్టాలు అందుకునే పది మంది విద్యార్థుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐఎస్బీ సిబ్బంది పూర్వాపరాలు కూడా ఒకటికి రెండుసార్లు పరిశీలించి నిర్ధారించుకుంటున్నారు.