Telugu Updates
Logo
Natyam ad

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. కొన్ని నిజాలు..?

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనం నిత్యం ప్రకృతితో అటాచ్ అయి ఉంటాం. చిన్నప్పుడు స్కూళ్లలో మొక్కలు నాటుతాం. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొని… ఓ మంచి పని చేసిన ఫీల్ పొందుతాం. ఆ ఫీల్ మనలో ఎప్పటికీ ఉంటుంది. ప్రకృతిని ప్రేమించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది.. అలా ప్రేమిస్తే… పర్యావరణానికి హాని చెయ్యలేం. సో.. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.

ప్రతి సంవత్సరం జూన్ 5 రాగానే… ప్రపంచం మొత్తం పర్యావరణం గురించి మాట్లాడుకుంటుంది. ఎందుకంటే అది ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ పర్యావరణం గురించి మాట్లాడుతాయి. భూమికి కలుగుతున్న రకరకాల కాలుష్యాలను ఎలా తగ్గించాలో చర్చిస్తాయి. ఏం చెయ్యాలో ఆలోచిస్తాయి. తీర్మానాలు చేస్తాయి. అవగాహనా కార్యక్రమాలు జరుపుతాయి. స్కూళ్లలో కూడా విద్యార్థులకు ఈ రోజు ప్రాధాన్యాన్ని టీచర్లు వివరిస్తారు. ఇవన్నీ ఏటా జరిగేవే. మరి నిజంగానే భూమిని మనం కాపాడుతున్నామా? అంటే లేదు అన్నదే సమాధానం.

1972లో తొలిసారి ప్రపంచ పర్యావరణ దినాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ రోజు.. మానవ పర్యావరణం అనే అంశంపై స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో పెద్ద కాన్ఫరెన్స్ పెట్టింది. 1974లో తొలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిపింది.

చిత్రమేంటంటే… ఇలాంటి రోజు వచ్చినప్పుడు దేశాలన్నీ భూమిపై ఎంతో ప్రేమ చూపిస్తాయి. నెక్ట్స్ డే నుంచి కథ మామూలే. భూమికి అత్యంత హాని చేస్తున్నది మనుషులే. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ రకరకాల కాలుష్యాలను సముద్రాల్లోకి పంపిస్తున్నాయి. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ఉండనే ఉంది. ఇవి చాలనట్లు అధిక జనాభా సమస్య మరొకటి. వీటికి తోడు భూతాపం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయంటే కారణం భూతాపమే. తెలంగాణలో 8 ఏళ్లుగా హరితహారంలో కోట్ల మొక్కలు పెంచినా… చల్లదనం రావట్లేదంటే కారణం.. వాయు కాలుష్యం అంతకంటే ఎక్కువగా ఉండటం వల్లే.

ఈ భూమిపై ఒకప్పుడు చాలా రకాల ప్రాణులుండేవి. అవన్నీ అంతరించిపోయాయి. ఇప్పటికీ చాలా వాటిని చంపేస్తున్నారు. పక్షులు చూద్దామన్నా కనిపించట్లేదు. తేనెటీగల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆహార దిగుబడి తగ్గుతోంది. దిగుబడి పెంచేందుకు పురుగుమందులు, రసాయనాల వాడుతుంటే.. భూమి నాశనం అవుతోంది. సముద్ర జీవుల్ని కూడా బతకనివ్వట్లేదు. ప్రభుత్వాల మాటలే తప్ప చేతల్లో పర్యావరణ రక్షణ కనిపించట్లేదని ప్రకృతి ప్రేమికులు ఏటా ఆవేదన చెందుతూనే ఉన్నారు.

ఈ సంవత్సరం “ఓన్లీ ది ఎర్త్” (Only One Earth) అనే థీమ్‌ని ఐక్యరాజ్యసమితి (UNO) ప్రకటించింది. నిజమే మనకు జీవించేందుకు ఉన్నది ఒకటే భూమి. ఇది నాశనం అయితే… మనకు దిక్కుండదు. కానీ దీన్ని కాపాడే విషయంలోనే ప్రభుత్వాలన్నీ ఒకే లైన్‌లోకి వచ్చి ఫెయిలవుతున్నాయి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక్కో దేశం ఆతిథ్యం ఇస్తుంది. ఈ దినోత్సవానికి ఇది 30వ పుట్టిన రోజు. అందువల్ల ఈ సంవత్సరం స్వీడన్‌లో వేడుకలు జరగనున్నాయి. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం  (UNEP),  దాని భాగస్వామ్య సంస్థలు… ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాయి. అత్యున్నతస్థాయి అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసి.. భూమిని కాపాడేందుకు ఏం చెయ్యాలో చర్చిస్తారు.

ఏం చెయ్యాలి?

కాలుష్యాన్ని తగ్గించాలంటే… సోలార్ పవర్ ఉత్పత్తి పెంచుకోవాలి. ఇళ్లలో లెడ్ లైట్ల వాడకం పెరగాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పక్కాగా అమలవ్వాలి. అడవుల్ని పెంచాలి. చెట్లను నరికేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. భారీ చెట్లను తొలగించాల్సి వస్తే.. వాటిని మరో చోట నాటాలి. వ్యవసాయంలో సంప్రదాయ (సేంద్రియ – organic) వ్యవసాయ పద్ధతుల్ని జోరుగా అమలుచెయ్యాలి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచాలి. ఇవన్నీ మనకు తెలిసినవే… వీటి అమలే సరిగా జరగట్లేదు. అదే సమస్యవుతోంది…

భూమిపై కొద్దిగా ఉండే వజ్రాలకు ఎంతో విలువ. అలాంటిది ఈ విశ్వంలోనే మనం జీవించేందుకు వీలైన ఒకే ఒక్కటి భూమి. దానికి విలువ కట్టలేం. అమూల్యమైనది. దాన్ని కాపాడుకుందాం. చేతనైనంతగా ప్రయత్నిద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.

*భూమి మన ఇల్లు. దీన్ని పరిశుభ్రంగా, పచ్చగా ఉంచుదాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ప్రకృతిని కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం.*

పంచ భూతాల్ని కాలుష్యమయం చేస్తే… ఆ మసి అంటుకునేది మనకే. నాశనం అయ్యేది మన జీవితాలే. ప్రళయ బాధితులం అయ్యేది మనమే. నిల్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాం. ఇకనైనా ప్రకృతిని కాపాడే దిశగా అడుగులు వేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.

పర్యావరణం లేనిదే మనం లేము. ప్రకృతి లేనిదే మన అభివృద్ధి లేదు. వాటిని కాపాడుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు…

మన చుట్టుపక్కల వాతావరణాన్ని కాపాడుకోవాలని గుర్తుచేస్తోంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మన భూమిని పచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతామని ప్రమాణం చేద్దాం.

ఆ దైవం ఈ భూమిని మనకు గిఫ్టుగా ఇచ్చింది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన బాధ్యతల్ని నెరవేర్చుదాం..

*”ఈ భూమి అందంగా, ఆనందంగా ఉండేందుకు… మనం అవకాశం ఇవ్వకపోతే… ఇది చివరికి ఆహారాన్ని కూడా ఉత్పత్తి చేయదు”.*

*”మనం పర్యావరణాన్ని నాశనం చేసుకుంటే… మనం బతికేందుకు ఏదీ ఉండదు”.*

*”ఇప్పుడు గాలిలో చాలా కాలుష్యం ఉంది. అది మన ఊపిరితిత్తులలో కాకపోతే… మరెక్కడా ఉంచడానికి స్థలం లేదు”.*

*”పరిరక్షణ అనేది మనుషులు, భూమి మధ్య సామరస్య స్థితి” ఉండాలి.*

*”చక్కటి పర్యావరణానికి పక్షులు నిదర్శనం. ఇవాళ వాటికి సమస్య వస్తే… ఆ తర్వాత రేపు మనకు ఆ సమస్య వస్తుంది”