జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు, హరికృష్ణ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన పేరోజ బాను తన భర్త సౌదీ అరేబియా దేశానికి ఉపాధి కొరకు వెళ్లి ఇటీవల ఇంటికి వచ్చాడని, వచ్చిన నెల రోజులకే క్యాన్సర్ కారణంగా మృతి చెందారని, ప్రభుత్వ జి.ఓ.216 ప్రకారం పరిహారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన రామగిరి నాగమణి గత సంవత్సరాలుగా తాము కిరాయి ఇంట్లో నివసిస్తున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన నాగరాజు నాగమణి, భీమారం మండల కేంద్రానికి చెందిన మాటేటి మల్లికలు తమ తండ్రికి సంబంధించిన భూమిని తమకు తెలియకుండా పట్టా చేసుకున్నారని, వీటిని రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల హనుమంతు తనకు రాజారాం గ్రామ శివారులో ఉన్న భూమిని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకొనగా కోర్టు ద్వారా తాను తిరిగి పొందానని, ఇట్టి భూమిని రెవెన్యూ రికార్డులలో తన పేరిట నమోదు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బి. హేమలత తాను ప్రభుత్వ జి.ఓ.59 ప్రకారం ఇంటితో సహా భూమిని పొందానని, తనకు సంబంధిత పట్టా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన మహమ్మద్ అహ్మద్ తనకు గ్రామ శివారులో గల భూమికి సంబంధించి కొలతలు చేయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం రెవెన్యూ శాఖ సంబంధించిన డైరీ-2025ను అధికారులు, చెన్నూర్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ డి.చంద్రకళ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.