మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావులతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. నస్పూర్ మండలం కృష్ణకాలనీకి చెందిన దొంతుల మొండయ్య తాను రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నానని, మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి పట్టణం 3వ జోన్ పాలచెట్టు ఏరియాకు చెందిన బొంకూరి మల్లిక తన కుటుంబం 20 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నామని, రెండు పడకల ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన కె. లక్ష్మణ్, ఇతరులు తమ దరఖాస్తులో బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న 24 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించడం జరిగిందని, ఈ విషయంపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు తమ దరఖాస్తులో ప్రభుత్వం నూతనంగా మండలాలు ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా చంద్రవెల్లి గ్రామపంచాయతీని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కోరారు. నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కాలనీకి చెందిన పోలు మౌనిక తనకు నూతన రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. తాండూర్ మండలం రేచిని గ్రామ పంచాయతీ ప్రజలు తమ గ్రామంలో 5 వేల జనాభా ఉందని, ప్రజల సౌకర్యార్థం నూతన మీ -సేవ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైపూర్ మండలం రసూల్పల్లికి చెందిన కుమ్మరి ప్రశాంత్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూ సేకరణలో తన భూమి, ఇల్లుతో సహా ఉన్నప్పటికీ వ్యవసాయ భూమిగా పరిగణించి తక్కువ నష్టపరిహారం లెక్కించారని, ఇంటి నివాస స్థలంగా పరిగణించి పరిహారం అందించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాసిపేట మండలం పల్లంగూడ గ్రామానికి చెందిన అల్లంల స్వామి తమ కుటుంబానికి చెందిన భూమికి సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుందని, ఇట్టి భూమికి రైతు భరోసా పథకం వర్తింపచేయవద్దని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీకి చెందిన బైరి కిరణ్ కుమార్ తాను కొనుగోలు చేసిన ఇంటిలో వేరొకరు తమ సామాగ్రిని ఉంచి తన ఇంటి స్థలాన్ని ఆక్రమించుకున్నారని, ఇట్టి స్థలానికి వారికి పట్టా మంజూరు ప్రక్రియ నిలిపివేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన ఈ. సుమలత తాను ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్నానని, నిరుపేద అయిన తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తాండూర్ మండలం రేచిని గ్రామపంచాయతీకి చెందిన నాగుల అంజయ్య తాను పంట సాగులో అన్ని ప్రమాణాలను పూర్తిగా పాటించానని, తనకు పంటల మినహాయింపు వర్తింపచేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరిగతిన పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.