Telugu Updates
Logo
Natyam ad

తెరాస నేతల పదవులు భాజపా పెట్టిన భిక్ష..!

వనపర్తి జిల్లా: పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడే అర్హత తెరాసకు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్రో ధరలు అత్యధికమని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కిష్టంపల్లె స్టేజీ వద్ద 100కి.మీ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి తన వెంట నడుస్తున్న శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. చమురుపై కేంద్రం రెండు సార్లు ఎక్సైజ్ సుంకం తగ్గించిందన్నారు. 18 రాష్ట్రాలు స్థానికంగా విధించే పన్నులను తగ్గించాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా తగ్గించలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వ్యాట్ నాలుగు శాతం పెంచారని బండి సంజయ్ ఆరోపించారు..

కేసీఆర్ పోరాట ఫలితంగానే బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై సంజయ్ ఎదురుదాడి చేశారు. తాను రాష్ట్రానికి చెందిన పార్టీకి అధ్యక్షుడిని కాదని.. దశాబ్దాల కాలం నాటి జాతీయ పార్టీలో నాయకుడినని చెప్పారు. తెరాస నేతలు అనుభవిస్తున్న పదవులు భాజపా పెట్టిన భిక్ష అని సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. తెరాసను తోక పార్టీ అన్న బండి సంజయ్ ఇతర పార్టీలపై ఆధారపడి మనుగడ సాగిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇస్తున్న హామీలను తుంగలో తొక్కి పేద ప్రజలకు తీవ్ర చేశారని మండిపడ్డారు. భాష, యాస పేరుతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న కేసీఆర్ మాటలను నమ్మొద్దని ఆయన సూచించారు..