పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన..?
ఆంజనేయులు న్యూస్: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగితే దాని ప్రభావం పెట్రో ఉత్పత్తులపై పడనుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ఇది భవిష్యత్తులో ఆకాశాన్నంటే ప్రమాదముందని తెలుస్తోంది. భారత్ లో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశముందనే వార్తలు ప్రజల్లో కలవరం సృష్టిస్తున్నాయి. తాజాగా దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్లోని ధరలను బట్టే మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఉంటాయన్నారు. చమురు సంస్థలు కూడా వాటి ఆధారంగానే ధరల్లో పెంపు, తగ్గుదల చేస్తాయన్నారు. ఏదేమైనా ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ లో గత నవంబర్ లో పెట్రో ధరలను కేంద్రం సవరించింది. ఆ సమయంలో లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ధరల్లో ఏ మార్పూ లేదు. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో పెట్రోలు ధరలు పెరుగుతాయనే సంకేతాలు వస్తున్నాయి..