Telugu Updates
Logo
Natyam ad

రోగికి గుండెపోటు.. వైద్యుడి చర్య పట్ల ప్రశంసలు వెల్లువ

ఆంజనేయులు న్యూస్: సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. అయితే, క్షణం ఆలస్యం చేయని ఆ వైద్యుడు.. రోగి కూర్చున్న కుర్చీలోనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారడంతో ఆ వైద్యుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన అర్జున్ అద్నాయక్ కార్డియాలజీ నిపుణుడు. కాగా, గుండె సంబంధిత వ్యాధి ఉన్న ఓ రోగి అర్జున్ వద్దకు నిత్యం జనరల్ చెకప్ కోసం వస్తుండేవారు. రెండ్రోజుల క్రితం రొటీన్ చెకప్ కోసం మరోసారి వైద్యుడి వద్దకు వచ్చారు. 12ఏళ్ల క్రితం అమర్చిన పేస్ మేకర్ ను ఈసారి భర్తీ చేయించుకోవాలనుకున్నారు. అయితే, క్యాబిన్ లో వైద్యుడి ముందు సీట్లో కూర్చున్న ఆ రోగికి.. ఉన్నట్టుండి అప్పుడే గుండెపోటు వచ్చింది. ఫలితంగా ఎలాంటి చలనం లేకుండా కుర్చీలో కిందికి వాలిపోసాగాడు. పరిస్థితిని గమనించిన వైద్యుడు అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. వెంటనే లేచివచ్చి కుర్చీలో ఉన్న అతడికి అక్కడే సీపీఆర్ చేశాడు. కొద్ది సెకన్లలో ఆ రోగి మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాడు. కాగా ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

క్షణం ఆలస్యం చేయకుండా వైద్యుడు వెంటనే స్పందించిన తీరు, సీపీఆర్ చేసి రోగిని అపాయం నుంచి బయటపడేసిన వైనం అందరినీ కట్టిపడేసింది. అర్జున్ ని మెచ్చుకుంటూ అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ ధనంజయ్ మహాదిక్ సైతం ట్విటర్ లో  ఈ వీడియో పోస్ట్ చేస్తూ… ‘మన మధ్యలోనే రియల్ హీరోలు జీవిస్తారని చెప్పేందుకు ఈ వీడియోనే ఒక సాక్ష్యం. డా. అర్జున్ అద్నాయక్ కొల్హాపూర్లోనే గొప్ప కార్డియాలజిస్ట్. ఇలాంటి గౌరవనీయులు, మంచి వ్యక్తులకు నా అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.