జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఎందరో అంధ దివ్యాంగులు తమ వైకల్యాన్ని అధిగమించి తాము ఎంచున్న రంగాలలో విజయం సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. శనివారం లూయిస్ బ్రెయిలీ 216వ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్వీరు లతో కలిసి హాజరై అంధ దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులు వైకల్యం ఉందని నిరాశ పడకుండా వైకల్యాన్ని ఎదురించి ఉన్నత స్థాయిలో నిలిచిన వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు.
లూయి బ్రెయిలీ అంధులకు అందించిన సేవలు చిరస్మరణీయమని, లూయి బ్రెయిలీ అందించిన బ్రెయిలీ లిపి ద్వారా ఎంతో మంది అంధులు ఉన్నత స్థానాలలో నిలిచారని అన్నారు. వైకల్యం అనేది శరీరానికి మాత్రమేనని మనసుకు, ఆలోచనకు కాదని, పిల్లలు అందరు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, ఎంచుకున్న లక్ష్యాన్ని అధిగమించి మరింత మందికి స్ఫూర్తిగా నిలువాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.ఆర్.ఓ. ఫర్జానా బేగం, డి.సి.పి.ఓ. ఆనంద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.