వాషింగ్టన్: నోటి ద్వారా తీసుకునేందుకు వీలుగా అభివృద్ధి చేసిన ఓ కొవిడ్ టీకా.. వ్యాధి నుంచి రక్షణ కల్పించడంతో పాటు ఇతరులకు వైరస్ సోకకుండా నిరోధించడంలోనూ మెరుగ్గా దోహదపడుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. నోటి నుంచి వెలువడే తుంపర్లలో వైరస్ సంఖ్యను అది గణనీయంగా తగ్గిస్తున్నట్లు నిర్ధారించింది. తాజా అధ్యయనంలో భాగంగా అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు చెందిన పరిశోధకులు.. అడినోవైరస్ ను వాహకంగా ఉపయోగించుకునేలా రూపొందించిన ఓ కొవిడ్ టీకాను పరీక్షించారు. ఈ వ్యాక్సిన్ ను మాత్ర రూపంలో నోటి ద్వారా తీసుకోవచ్చు. రక్తం, ఊపిరితిత్తుల్లో సమర్థ యాంటీబాడీలను తయారుచేయడం ద్వారా కొవిడ్ నుంచి అది రక్షణ కల్పిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
ఇంజక్షన్ ద్వారా కండరాల్లోకి ప్రవేశపెట్టే ఇతర టీకాలతో పోలిస్తే ఈ వ్యాక్సిన్ ‘ఇమ్యునోగ్లోబ్యులిన్-ఎ(ఐజీ-ఎ)’ను అధికంగా ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్లలో వైరస్ల సంఖ్య గణనీయంగా తగ్గించడంలో ఐజీ-ఎ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు..