హైదరాబాద్: ‘ప్రేమఖైదీ’, ‘బంగారు మొగుడు’, ‘భలే మావయ్య’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి మాలశ్రీ కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె సాహసవీరుడు సాగరకన్య’ తర్వాత తెలుగుతెరకు దూరమయ్యారు. ఇప్పుడు.. 25 సంవత్సరాల తర్వాత ఆమె మొదటిసారి బుల్లితెరపై తళుక్కున మెరిశారు. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ఆమె అతిథిగా విచ్చేశారు. తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. “సాహసవీరుడు ‘సాగరకన్య’ తర్వాత నాకు వివాహమైంది. అదే సమయంలో కన్నడలో ఫుల్ బిజీ అయిపోయాను. అక్కడ వరుసగా యాక్షన్ సినిమాలు చేసి యాక్షన్ హీరోలా అయిపోయా. అలా తెలుగు తెరకు కాస్త దూరంగా ఉన్నా” అని మాలశ్రీ తెలిపారు. అనంతరం ‘ప్రేమఖైదీ’ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. “ఆ సినిమా 100వ రోజు నాడు.. సినిమాలో పనిచేసిన హీరోహీరోయిన్లకి రామానాయుడు ఖరీదైన వాహనాలను గిఫ్ట్ పంపించారు” అని చెప్పారు..