Telugu Updates
Logo
Natyam ad

నా అసలు పేరు ద్రౌపదీ కాదు: రాష్ట్రపతి ముర్ము

రెండు నెలల పాటు నేను ఒత్తిడిలో కూరుకుపోయా.

జీవితంలో జరిగిన విషాదాలను గుర్తుచేసుకొని: ముర్ము భావోద్వేగం చెందారు.

భువనేశ్వర్: దేశ నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము నేడు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన వేడుకలో ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ మహిళగా సరికొత్త చరిత్ర లిఖించిన ఆమె అసలు పేరు ద్రౌపదీ కాదట. ఈ విషయాన్ని ముర్మునే స్వయంగా వెల్లడించారు. ద్రౌపదీ అనే పేరును తన స్కూల్ టీచర్ పెట్టినట్లు గతంలో ఓ సందర్భంలో చెప్పారు. కొంతకాలం క్రితం ముర్ము ఓ ఒడియా వీడియో మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు తాజాగా బయటకొచ్చాయి. అందులో ఆమె తన పేరుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు.

“ద్రౌపదీ నా అసలు పేరు కాదు. మా తల్లిదండ్రులు నాకు సంతాలీలో ‘పుటి’ అని పేరు పెట్టారు. స్కూల్లో చదువుతున్న సమయంలో మా టీచర్ ఒకరు ఈ పేరు అంతగా బాలేదని మార్చేశారు. ద్రౌపదీ అని పేరు పెట్టారు” అని ముర్ము నాటి సంగతులను గుర్తుచేసుకొన్నారు. సంతాలీ సంప్రదాయంలో పేర్లు ఎప్పటికీ మారవని ద్రౌపదీ అన్నారు. ఆడపిల్ల పుడితే బామ్మ పేరు, అబ్బాయి పుడితే తాత పేరు పెట్టడం తమ ఆనవాయితీ అని చెప్పారు. అందుకే ఆ పేర్లు వస్తుంటాయని తెలిపారు. స్కూల్, కాలేజీలో తన పూర్తి పేరు ద్రౌపదీ తుడుగా ఉండేదని, పెళ్లయ్యాక మెట్టినింటి పేరు చేరడంతో ద్రౌపదీ ముర్ముగా మారిందని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదాలను గుర్తుచేసుకొని ముర్ము భావోద్వేగం చెందారు. “నా జీవితంలో పెను సునామీ సంభవించింది. మా పెద్దబ్బాయి రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు నా గుండె బద్దలైంది. రెండు నెలల పాటు నేను ఒత్తిడిలో కూరుకుపోయా. ఇంటి నుంచి బయటకు రాలేకపోయా. ఆ బాధ నుంచి తేరుకునేలోపే చిన్న కుమారుడు దూరమయ్యాడు. భర్తను కోల్పోయా. కానీ, సంతోషమైనా, బాధైనా జీవితంలో ఒక భాగమే అనుకుంటూ ముందుకు “సాగా..” అని ముర్ము ఉద్వేగానికి గురయ్యారు.