ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్..?
సూపరింటెండెంట్ బదిలీ, ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు..
హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలోని ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేసిన విషయం తెలిసిందే. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించి చర్యలకు ఉపక్రమించింది. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ పై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సూపరింటెండెంట్ గా చంద్రశేఖర్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎంజీఎం ఆస్పత్రి ఘటనపై మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గతకొన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్య రావడంతో నాలుగు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేర్చారు. రోగి పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంజీఎంలో చేరిన తొలిరోజే రోగి శ్రీనివాస్ కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. వెంటనే కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో కట్టుకట్టారు. ఇవాళ ఉదయం కూడా ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడమ వద్ద ఎలుకలు కొరికేయడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వైద్యులు మళ్లీ కట్టుకట్టి చికిత్స అందించారు..