Telugu Updates
Logo
Natyam ad

మంత్రి హత్యకు కుట్ర కేసు.. పోలీసు కస్టడీలో నిందితులు

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులు పోలీసు కస్టడీ ఇవాళ సాయంత్రం ముగిసింది. నిందితులను మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అనుమతితో పేట్బషీరాబాద్ పోలీసులు.. నిందితులు నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, అమరేంద్రరాజు, రాఘవేంద్రరాజు, మధుసూదన్రాజు, మున్నూరు రవిలను నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. అయితే, విచారణలో పాత విషయాలను మాత్రమే తెలిపినట్లు సమాచారం. హత్య ఎందుకు చేయాలనుకున్నారు? తుపాకులను ఎక్కడి నుంచి తెచ్చారు? డబ్బులు ఎవరు సమకూర్చనున్నారు? ఈ కుట్ర కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉందనే దానిపై విచారణ కొనసాగింది. నిందితులు గతంలో చెప్పిన విషయాలను మాత్రమే చెప్పి మౌనంగా ఉన్నట్టు తెలిసింది. పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నించినప్పటికీ నిందితులు నోరు మెదపలేదని సమాచారం. ఈ నేపథ్యంలో మరో సారి నిందితులను కస్టడీకి తీసుకునే యోచనలో పేట్బషీరాబాద్ పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.

రాత్రిపూట విచారణలో పోలీసులు తమను వేధించే అవకాశముందంటూ విశ్వనాథారావు, రవిలు హైకోర్టును ఆశ్రయించడంతో కింది కోర్టు ఇచ్చిన షరతులను హైకోర్టు సవరించింది. ఉదయం నుంచి సాయంత్ర వరకే విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో నాలుగు రోజుల పాటు బి. విశ్వనాథ్ రావు, ఎం.రవిలను ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకే పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ప్రతిరోజూ విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి చర్లపల్లి జైలు సూపరింటెండెంటు కు అప్పగించారు.