ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంచిర్యాల ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భరోసా ఇచ్చారు. శనివారం గోదావరి రోడ్ లో నిర్మిస్తున్న మహాప్రస్థానం, రోడ్డు విస్తరణలో భాగంగా తొలగిస్తున్న కట్టడాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానన్నారు. మూడేళ్ళ లోపు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని తెలిపారు. మహాప్రస్థానం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని శివరాత్రి పండుగ లోపు పూర్తి చేస్తామని తెలిపారు. మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణం పనులు వేగవంతం గా జరుగుతున్నాయని, సెల్లార్ తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈనెలాఖరులో రాళ్ళవాగు ఇరువైపులా కరకట్ట నిర్మాణం పనులు ఆరంభించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మెయిన్ రోడ్, కూరగాయల మార్కెట్, వాటర్ ట్యాన్క్ రోడ్, శ్రీనివాస్ టాకీస్ రోడ్ రహదారి విస్తరణ పనులు ఆరునెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వ్యాపారస్థులు ఇబ్బందులు పడకుండా పనులు జరిపితీరుతామని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైన్ పనులు పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్నామని తెలిపారు. ఆరు నెలల తర్వాత వ్యాపార కూడళ్ల రూపురేఖలు సుందరంగా మారుతాయని అన్నారు.
మంచిర్యాల మున్సిపాలిటి కార్పొరేషన్ గా మారితే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలుపుతానని చెప్పారు. సింగరేణి కార్మికులకు ఇండ్ల పట్టాల పంపిణీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. తన ఆరోగ్యంపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. కాలుకు చిన్న ఆపరేషన్ జరిగిందని కానీ ప్రత్యర్థులు చిలువలు పలువలుగా ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రజల ఆశీస్సులు తో తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..