లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం.. ప్రత్యేక ఆకర్షణగా నంబర్ ప్లేట్
లండన్: విదేశీ పర్యటనలో భాగంగా యూకే వెళ్లిన తెలంగాణ మంత్రి కేటీఆర్కు లండన్లో ఘనస్వాగతం లభించింది. అక్కడి విమానాశ్రయంలో ఎన్ఆర్ఎస్ఐ తెరాస-యూకే విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఎస్ఐ సంఘాలు ఆయనకు స్వాగతం పలికాయి. కేటీఆర్కు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మందితో ఎయిర్పోర్ట్ కోలాహలం నెలకొంది. అనేక మంది తమ కుటుంబ సభ్యులతో ఎయిర్పోర్ట్కు చేరుకొని.. కేటీఆర్ ఫొటోలు తీసుకొనేందుకు ఉత్సాహం చూపించారు. కేటీఆర్ ఇవాళ అనేక రంగాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా కేటీఆర్ కు స్వాగతం పలికారు.
కేటీఆర్ లండన్ పర్యటన సందర్భంగా ఓ కారు నంబర్ ప్లేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీఆర్ఎస్ కేటీఆర్ అని కనిపించేలా నంబర్ ప్లేట్ ఉన్న కారు వద్ద దిగిన ఫొటోను కేటీఆర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఆ ప్రత్యేక నెంబర్ ప్లేట్ ఉన్న కారులో రైడ్కు తీసుకెళ్లినందుకు ఎన్ఆర్ తెరాస నేత అశోకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. యూకే పర్యటన అనంతరం కేటీఆర్ దావోస్ వెళ్లనున్నారు..