హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు గుండె, యాంజియో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది. అస్వస్థత కారణంగా నేటి యాదాద్రి పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, మనవడు హిమాన్హ్, ఎంపీ సంతోష్ ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లు యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.
యాంజియోగ్రామ్ నిర్వహించాం : డా. ఎంవీ రావు..
కేసీఆర్ ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారని యశోద ఆస్పత్రి వైద్యుడు డా. ఎంవీ రావు తెలిపారు. ప్రాథమిక పరీక్షల అనంతరం యాంజియోగ్రామ్ నిర్వహించినట్లు వెల్లడించారు. సాధారణ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.