Telugu Updates
Logo
Natyam ad

ఆస్పత్రి నుంచి సీఎం డిశ్చార్జ్..!

కేసీఆర్ కు గుండె సంబంధిత సమస్యలు ఏమీ లేవు : యశోద వైద్యులు

హైదరాబాద్: స్వల్ప అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్ కు యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. యశోద ఆస్పత్రి నుంచి ప్రగతిభవన్ కు వెళ్లారు. అంతకుముందు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాకు వివరించారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డా. ఎంవీ రావుతో పాటు మరికొందరు యశోద ఆస్పత్రి వైద్యులు వివరాలను వెల్లడించారు. ‘ఈ ఉదయం 8 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ప్రగతి భవన్ కి వెళ్లి పరిశీలించాం. రెండు రోజులుగా అలసిపోయినట్లు సీఎం చెప్పారు. ఎడమ చేయి నొప్పి ఉందన్నారు. కొన్ని పరీక్షలు చేయాలి.. ఆస్పత్రికి రావాలని సీఎంకు మేం సూచించాం. సర్వైకల్ స్పైన్ వల్ల నరంపై ఒత్తిడి పడి చెయ్యి నొప్పి వచ్చింది. వరుస పర్యటనలు, ఉపన్యాసాలు చేయడం వల్ల నీరసంగా ఉన్నారు. యాంజియోగ్రామ్ నిర్వహిస్తే బ్లాక్స్ లేవని తెలిసింది. గుండె పనితీరు బాగానే ఉందని పరీక్షల్లో తేలింది. గుండెకు సంబంధించిన పరీక్షల్లో సాధారణంగా ఉందని రిపోర్టులు వచ్చాయి. కేసీఆర్ కు బీపీ, షుగర్ సాధారణంగా ఉన్నాయి. రక్త పరీక్షల్లోనూ ఎలాంటి సమస్యలు లేవని తేలింది. వైద్య పరీక్షల తర్వాత 3-4 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతాం. మధ్యాహ్నం 3 గంటలకు సీఎంను డిశ్చార్జ్ చేస్తాం. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. ఆ తర్వాత ఆయన పనులను యాథావిధిగా చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చే సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తాం అని వైద్యుల బృందం వెల్లడించింది.