Telugu Updates
Logo
Natyam ad

ఆకాశం నుంచి కిందపడిన ఇనుప శకలం..!

సిలిండర్ వంటి వస్తువు కూడా..

త్వరలో పరిశీలించనున్న విపత్తు నిర్వహణ బృందం..

బల్లార్ష: ఆకాశం నుంచి మెరుస్తూ భారీ ఇనుప శకలం, సిలిండర్ వంటి గుర్తుతెలియని వస్తువులు శనివారం రాత్రి మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలోని సిందెవాహి ప్రాంతంలో పడినట్లు కలెక్టర్ అజయ్ గుల్షానె ఆదివారం తెలిపారు. ముంబయి నుంచి విపత్తు నిర్వహణ బృందం త్వరలోనే వచ్చి ఈ ప్రాంతంలో పర్యటించి ఆ వస్తువులేమిటనేది పరిశీలిస్తుందన్నారు. లాడ్బోర్ గ్రామంలో ఇనుప శకలం, పవన్పార్ సిలిండర్ పడినట్లు ఆయన వెల్లడించారు. ఉగాది సందర్భంగా విదర్భ ప్రాంతంలోని ప్రజలంతా వేడుకల్లో నిమగ్నమై ఉండగా.. ఒక్కసారి ఆకాశం నుంచి మెరుపులతో కూడిన వస్తువు కిందకి రాలడం కనిపించింది. ఉల్కలు పడుతున్నాయని భావించిన ప్రజలు.. ఇనుప శకలం, సిలిండర్లాంటి వస్తువు పడటంతో భయాందోళనలకు గురయ్యారు. అవి కిందకి పడుతున్న దృశ్యాలను పలువురు తమ చరవాణిల్లో చిత్రీకరించారు. భారీ ఇనుప శకలం లాడ్బోర్ గ్రామ పరిధిలోని ఖాళీ ప్రదేశంలో పడటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం గ్రామస్థులు ఈ శకలాన్ని ట్రాక్టరుపై తీసుకెళ్లి తాలూకా కేంద్రమైన సిందెవాహి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ విషయమై స్థానిక ఖగోళశాస్త్రవేత్త సురేష్ పనేను సంప్రదించగా… ఉపగ్రహ ప్రయోగానంతరం కూలిన రాకెట్ బూస్టర్ అయ్యిండొచ్చునని అభిప్రాయపడ్డారు..