Telugu Updates
Logo
Natyam ad

అవమానాలు భరించలేక వెళ్తున్నాం..!

పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు

ఇంట్లో నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు.

అధినేత కోసం అన్నీ భరించాం.

ఇక భరించడం మా వల్ల కాదు.. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

నేడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

మంచిర్యాల జిల్లా: పార్టీలో తమను ఎన్నో రకాలుగా అవమానాలకు గురి చేశారని, వాటిని భరించలేకే వెళ్తున్నానని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ లోకి ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ఆంజనేయులు న్యూస్ తో మాట్లాడారు. పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టకుండా కట్టుదిట్టం చేశారని అన్నారు. నా భార్య, జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మికి సంబంధించి ఎన్నో సందర్భాలు కనీసం ప్రొటోకాల్ కూడా పాటించలేదన్నారు. ఆమె కోటపల్లికి సైతం వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేశారని వెల్లడించారు. తమకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని వదులుకోవడం ఇష్టం లేక ఎన్నో అవమానాలు భరించామని అధినేత కోసం అన్ని సహించామన్నారు. ఇక భరించడం మా వల్ల కాదని అందుకే పార్టీ మారదామని నిర్ణయించుకున్నామని నల్లాల ఓదెలు స్పష్టం చేశారు.

ఈ రోజే కాంగ్రెస్ లో చేరిక…
మాజీ ఎమ్మల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి ఈ రోజు మద్యాహ్నం రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే రాష్ట్ర నేతలతో మంతనాలు పూర్తి చేసుకున్న వారిద్దరూ రాత్రికి రాత్రే ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో సైతం కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు..