మంచిర్యాల డిసీపీ ఎగ్గడి భాస్కర్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ చెన్నూరు రూరల్ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమనపల్లి మండలం లో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగి రచర్ల, మల్కలపేట మధ్య గల వంతెన మునిగిపోయింది. ప్రజలు అత్యవసర పరిస్థితులలో ప్రయాణం చేయలేక పోయారు. అట్టి సమాచారం తెలిసిన రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐ.పీ.ఎస్ (ఐజి) ఆదేశానుసారం మంచిర్యాల డిసిపి, రాచర్లకి జిల్లా పోలీసు రెస్క్యూ టీమ్ తో వెళ్లి అక్కడ ప్రజల పరిస్థితి చూసి వారికి సహాయం అందించామని తెలిపారు. ఆనతరం డిసిపి భాస్కర్ జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్ తో కలిసి రెస్క్యూ టీమ్ తో స్వయంగా బోటు నడిపి రాచర్ల మధ్య బ్రిడ్జి మునిగిపోయిన ప్రాంతానికి మరియు రహదారి దిగ్బంధం ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి, అక్కడి ప్రజలకు పోలీసుల ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని దైర్యం నింపారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ..
వర్షం కారణంగా రహదారులన్ని జలమయమయ్యాయి. వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండి ఉండటం వలన రోడ్డు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని, అత్యవసరమయితే తప్ప బయటకి రావద్దని జిల్లా డిసిపి భాస్కర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు వంకలు, చెరువులు,నదులు పొంగి ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామం నుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని గురించి సమాచారాన్ని సేకరించి అవసరమైతే అక్కడికి చేరుకొని ప్రజలకు అండగా ఉండాలని తెలియజేసారు. జిల్లాలోని ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఇతర శాఖలతో సమన్వయం పాటిస్తూ పోలీస్ యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న నదులను పొంగిపొర్లుతున్న చెరువులను, వాగులను చూడటానికి బయటికి వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్నవారు డయల్ 100నకు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు.