మానవ నిర్లక్ష్యమే దీనికి కారణం
సకాలంలో మంటలు ఆర్పివేసిన అటవీ, అగ్ని మాపక సిబ్బంది
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా, జైపూర్: మంచిర్యాల అటవీ డివిజన్ పరిధిలోని జైపూర్ మండలం ఇందారం రక్షిత అటవీ ప్రాంతం లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మంచిర్యాల – హైదరాబాద్ ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న ఇందారం అటవీ ప్రాంతంలో మంటలు వస్తున్నాయని అటవీ అభివృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ కు అటువైపు గా వెళుతున్న పత్రికా విలేకరులు వారి సామాజిక భాద్యత గా సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ తమ అటవీ శాఖ అధికారులకు, ఇతర సిబ్బందికి సమాచారం ఇచ్చి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాచర్ తుత్తుర్ల శంకర్ సహాయంతో ఫైర్ కంట్రోల్ బ్లోయర్ తో మంటలు అర్పివేయిస్తూ మంచిర్యాల అగ్ని మాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వెంటనే ఫైర్ ఇంజిన్ ను ప్రమాద స్థలానికి పంపించారు. అటవీ, అగ్ని మాపక సిబ్బంది అందరూ శ్రమించి మంటలు విస్తరించకుండా పూర్తిగా అర్పివేసారు. సకాలంలో ఈ మంటలను ఆర్పివేసి అటవీ ప్రాంతాన్ని రక్షించారు. ప్రధాన రహదారి వెంట వెళ్లే వారు సిగరెట్ లేదా బీడీలు తాగి పడేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మానవ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల విషయం లో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటేనే సాధ్యమైనంత వరకు వాటిని నివారించవచ్చని అటవీ అభివృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాల వల్లే మంచిగా పెరిగిన పచ్చని చెట్లు ఎండిపోయి చనిపోతున్నాయాన్నారు. ఎక్కడైనా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.