Telugu Updates
Logo
Natyam ad

అక్రమ నిర్మాణాల కూల్చివేత..!

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: పట్టణంలోని షంషీర్ నగర్ ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపించారు. 170 పీపీ ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని పలు మార్లు హెచ్చరించినా వారు వినకపోవడంతో పోలీసుల బందోబస్తు నడుమ శుక్రవారం నిర్మాణాలను కూల్చివేయించారు. దీంతో అధికారులకు, స్థానికులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. ఆక్రమణలను వారు అడ్డుకున్నారు. పోలీసులు కలగచేసుకుని బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు పంపించి నిర్మాణాలను నేలమట్టం చేశారు.

బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని  పోలీసులచే బందోబస్తు ఏర్పాటు చేయించారు. తహసీల్దార్ కుమారస్వామి, మున్సిపల్ కమీషనర్ జంపాల రజిత తన పూర్తి సిబ్బందితో అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా కూల్చివేయడం ప్రారంభించారు. తమ ఇళ్లకు ఇంటి నెంబర్లు ఉన్నాయని ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని అధికారులకు చూపిస్తూ అడ్డుకున్నారు. కూల్చివేయవద్దని వారితో వాగ్వాదానికి దిగారు. ఓ కుటుంబం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఓ మహిళ గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా, మరో మహిళ కత్తితో పొడుచుకుంటానని ప్రాధేయపడగా ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అడ్డుకుని పోలీస్ స్టేషను కు తరలించారు..

అనంతరం అధికార యంత్రాంగం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కలెక్టర్ ఆదేశాలతో, నెలలుగా వారికి నోటీసులు ఇచ్చినా వారు పట్టించుకోకపోవడంతో ఇళ్లు కూల్చివేశామని తహసీల్దార్ కుమారస్వామి తెలిపారు. దొంగ ఇంటి నెంబర్లు పొందారని మున్సిపల్ కమీషనర్ జంపాల రజిత తెలిపారు..