హైదరాబాద్: ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రధాని ఇవాళ హైదరాబాద్ వస్తున్నారని.. రెండు రోజులు ఇక్కడే ఉంటారన్నారు. తెరాస వేసే ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్లో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడారు. “తెలంగాణ ప్రజల పక్షాన యశ్వంత్ సిన్హాకు నా హృదయపూర్వక స్వాగతం. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి. వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారు. భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హాది కీలకపాత్ర. ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవం ఉంది. మంత్రిగా దేశానికి అనేక సేవలు చేశారు. న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి ఆర్థిక మంత్రిగా ఉత్తమ సేవలు అందించారు. ఆత్మప్రభోదానుసారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలి. అభ్యర్థులను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుంది” అని సీఎం అన్నారు..