Telugu Updates
Logo
Natyam ad

డీసీపీ పై వేటుకు కారణం ఇదేనా..?

కరీంనగర్: పెద్దపల్లి డీసీపీ రవిందర్ ను అకస్మాత్తుగా డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడడం రామగుండం కమిషనరేట్ లో సంచలనం కల్గించింది. డీసీపీ స్థాయి అధికారిపై ఆరోపణలు రావడం సంచలనం కల్గిస్తోంది. పెద్దపల్లి సమీపంలోని పెద్దబొంకూరుకు చెందిన లక్ష్మీరాజ నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో స్పెషల్ టీంలు రంగంలోకి దిగి ఆరా తీయగా వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేఫథ్యంలోనే రవిందర్ ను డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డట్టు సమాచారం.

పెద్దపల్లి పట్టణ పరిసరాల్లో రవిందర్ కు అతని కుటుంబ సభ్యుల పేరిట ప్లాట్లు కొనుగోలు చేసిన వివరాలను కూడా లక్ష్మిరాజం డీజీ కార్యాలయానికి పంపించారు. 9 చోట్ల ప్లాట్లు ఉన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ప్రధానంగా ఓ నిందితునితో మిలాఖత్ అయి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా రవిందర్ అతనికి బాసటగా నిలిచాడని ఫిర్యాదులో వివరించారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా డీసీపీ రవిందర్ నిలువరించారని, అలాగే సదరు నిందితుడు దళితుల భూమి దురక్రామణ చేసిన విషయంలోనూ డీసీపీ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని లక్ష్మీరాజం వివరించారు. రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసిన విషయంలోనూ నిందితులకే వత్తాసు డీసీపీ పలుకుతున్నాడని తెలిపారు.

పెద్దపల్లి డీసీపీ రవిందర్ ను పోలీసు బాస్ ఒకరు హెచ్చరించి నడవడిక మార్చుకోవాలని చెప్పినా కూడా వినకుండా తన స్టైల్లో అక్రమాలకు పాల్పడ్డట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి బాసటగా నిలవడంతో పాటు అవినీతి వ్యవహారాలకు దూరంగా ఉండాలని కూడా సదరు అధికారి మందలించినా తన వైఖరిలో మాత్రం మార్పు రానట్టుగా పోలీసుల్లో చర్చ సాగుతోంది. లక్ష్మీరాజం ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకుని డీజీపీ కార్యాలయం నుండి ప్రత్యేకంగా వచ్చిన టీమ్ ఆరా తీసినట్టుగా సమాచారం. రెండు రోజుల క్రితం విచారణ చేపట్టిన ఈ బృందం ఫిర్యాదులో పేర్కొన్న 9 ప్లాట్లే కాకుండా ఇంకా చాలా వాటిని గుర్తించినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లో జరిగిన వెంచర్లలో డీసీపీ జోక్యం కంపల్సరీ అన్నట్టుగా మారిపోయిందని విచారణ బృందం తేల్చినట్టుగా సమాచారం. అంతేకాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ స్థిరాస్థులు కూడబెట్టినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు ఆరాలో బట్టబయలు అయినట్టు సమాచారం.

రామగుండం కమిషనరేట్ పరిధిలోనే పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్న డీసీపీ నడవడికలో మార్పు రాకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. పోలీసు అదికారులకు సంబందించిన ఆడియోలో ఓ కౌన్సిలర్ ను ఇబ్బందులకు గురి చేసి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యవహారం సద్దుమణిగిన తరువాత ఉన్నతాధికారులు కూడా రామగుండం కమిషనరేట్ పై ప్రత్యేక దృష్టి సారించారన్న విషయాన్ని విస్మరించి మరీ అక్రమాలకు పాల్పడడమే విడ్డూరంగా మారింది. కిందిస్థాయి అధికారులపై ఒత్తిళ్లకు గురి చేస్తూ నిందితుల అరెస్ట్ లను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టడం కూడా ఆయనపై మచ్చపడినట్టుగా అయింది. ఏది ఏమైనా డీసీపీని అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడడం మాత్రం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది..