దిల్లీలో భారీ వర్షం.. పలుచోట్ల కూలిన ఇళ్లు..!
దిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షం కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. గత కొన్ని రోజులుగా మండుటెండలతో అల్లాడిపోతున్న దిల్లీ వాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఈ తెల్లవారుజాము నుంచి ఢిల్లీలో వర్షం కురుస్తోంది. గంటకు 50-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలి రోడ్లపై పడ్డాయి. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయినట్లు ఎయిర్పోర్టు ట్విటర్ వేదికగా వెల్లడించింది. ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించి తదుపరి సమాచారం తెలుసుకోవాలని సూచించింది. అటు పలు విమానయాన సంస్థలు కూడా దీనిపై ప్రయాణికులకు పలు సూచనలు చేశాయి. దీంతో ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రానున్న మరికొన్ని గంటల్లోనూ దుమ్ము తుపాను, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, తలుపులు, కిటికీలు మూసుకోవాలని సూచించింది.