Telugu Updates
Logo
Natyam ad

కేసీఆర్ కిట్ తో అద్భుత ఫలితాలు: మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: కేసీఆర్ కిట్ అద్భుత ఫలితాలు ఇస్తోందని.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 56శాతం ప్రసవాలు జరుగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2014 తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 26 శాతం మేర పెరిగాయన్నారు. 2017 జూన్ 2 నుంచి ఇప్పటివరకు 10.85 లక్షల కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాతా, శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తోందని.. ఇందుకోసం రూ.407 కోట్లతో 22 మాతా, శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. వీటిలో ఇప్పటికే 16 కేంద్రాల నిర్మాణం పూర్తయ్యాయని చెప్పారు 2014లో ప్రసూతి మరణాలు (Maternal mortality Rate) 92 ఉండగా ఇప్పుడది 63కి తగ్గిందని.. శిశు మరణాల రేటు (Infant Mortality Rate) సైతం 39 నుంచి 23కు తగ్గినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో పోషకాహార లోపం సమస్యను అధిగమించేందుకు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని బడ్జెట్లో ప్రవేశ పెట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనున్నట్టు హరీశ్రావు వివరించారు.