Telugu Updates
Logo
Natyam ad

రాజ్యసభకు హర్భజన్ సింగ్..?

చండీగఢ్: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అతి త్వరలోనే రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ భజ్జీని పంజాబ్ నుంచి తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ నెలాఖరులో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఐదు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అందులో ఒక స్థానానికి భజ్జీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పంజాబ్లో భగవంత్ మాన్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఆప్ ప్రభుత్వం.. భజ్జీకి స్పోర్ట్స్ యూనివర్శిటీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హర్భజన్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తొలుత ఆయన భాజపాలో చేరతారని ఊహాగానాలు వినిపించగా.. ఆ వార్తలను భజ్జీ కొట్టిపారేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి ఫొటో దిగారు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, అది కూడా జరగలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల పంజాబ్లో ఆప్ గెలిచిన తర్వాత భగవంత్మాన్ తన తల్లిని హత్తుకున్న ఫొటోను భజ్జీ షేర్ చేస్తూ అభినందనలు తెలిపారు. దీంతో ఆయన ఆప్లో చేరడం ఖాయమే అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను రాజ్యసభకు పంపాలని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ విషయమై భజ్జీతో చర్చించింది. ఇందుకు ఆయన సుముఖంగా ఉండటంతో పంజాబ్ నుంచి ఆయనను ఎంపిక చేసినట్లు సమాచారం..