మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని మంచిర్యాల మున్సిపాలిటీని ప్రభుత్వం కార్పొరేషన్ గా మార్చినందున కార్పొరేషన్ పరిధిలో మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు జి.ఐ.ఎస్. ఆధారిత ప్రతిపాదనలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో టౌన్ & కంట్రీ ప్లానింగ్ శాఖ-హైదరాబాద్ అదనపు సంచాలకులు రమేష్బాబు, మంచిర్యాల మున్సిపల్ కమీషనర్ శివాజీ లతో కలిసి సంబంధిత అధికారులకు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల రూపకల్పనపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ గా నవీకరించడం జరుగుతుందని, ఈ క్రమంలో డ్రోన్ సర్వే ద్వారా సంబంధిత వివరాలను సేకరించడం జరిగిందని తెలిపారు. సంబంధిత శాఖల ద్వారా కార్పొరేషన్ రూపకల్పనతో పాటు నివాస ప్రాంతాలు, పారిశ్రామికంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించడం జరుగుతుందని, ఆయా ప్రాంతాలలో సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్, బ్రాడ్డ్ నెట్వర్క్, ట్రాఫిక్ ప్లానింగ్, మెడికల్, నీటి వనరులు, పరిశ్రమల స్థాపన ఇతరత్రా అంశాలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖల నుండి సేకరించడం జరుగుతుందని తెలిపారు. డ్రోన్ సర్వే ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, బేస్మ్యాప్ రూపొందించి సంబంధిత శాఖల ద్వారా వివరాలను సేకరించి పరిశీలించడం జరుగుతుందని, స్టడీ మ్యాప్స్ తయారు చేసి సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించి ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించడం జరుగుతుందని తెలిపారు.
ఆమోదిత ముసాయిదా ప్లాన్ ను ప్రచురించి అభ్యంతరాలు, ఫిర్యాదులు, సలహాలు స్వీకరించడం జరుగుతుందని, అనంతరం తుది ప్రణాళికను నిర్ధారించి అమలు చేసే దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మాస్టర్ ప్లాన్ సంబంధించి వివరాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శాఖల వారిగా అందించవలసిన సమాచారం, విధులు, బాధ్యతలు, వివిధ అంశాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.