మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహంలో నూతన సంవత్సరం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అందించిన 144 బ్లాంకెట్లను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతుందని, ఇందులో భాగంగా ఇటీవల డైట్ చార్జీలను 40 శాతం, కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచడం జరిగిందని, నూతన మెనును అమలు చేస్తూ పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు సమన్వయంతో అవసరం ఉన్న వారు వినియోగించుకునేలా కలిసి ఉండాలని, విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలిపారు.
విద్యార్థులు చదువులో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఏకాగ్రతతో చదివి సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని, ఉత్తమ ఫలితాలు సాధించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయిలో నిలువాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారంతో పాటు త్రాగునీరు ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, చదువుతో పాటు క్రీడలలో రాణించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వసతి గృహ సంక్షేమాధికారికి, ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.