మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన మన భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డా. బి. ఆర్. అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐ . బి. చౌరస్తాలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు పోటు రవీందర్ రెడ్డి, షెడ్యూల్డ్ కులముల కార్పొరేషన్ ఈ. డి. దుర్గాప్రసాద్ లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యున్నత విద్యను అభ్యసించి రాజ్యాంగాన్ని రూపొందించారని, ఈ రాజ్యాంగం ద్వారా దేశంలోని బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం హక్కులు కల్పించి వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి, అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. నేడు దేశంలో మనం అనుభవిస్తున్న ప్రతి హక్కు రాజ్యాంగం ద్వారా మనకు కల్పించడం జరిగిందని, ఇలాంటి అత్యున్నత విలువలు కలిగిన రాజ్యాంగాన్ని మనకు అందించిన అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. మహనీయులు ఆచరించి చూపిన మార్గాలను అనుసరిస్తూ ప్రతి ఒక్కరు దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె. చిన్నయ్య, జిల్లా వయోజన విద్య అధికారి పురుషోత్తం నాయక్, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.