ఆంజనేయులు న్యూస్: రంగుల ప్రపంచమైన సినిమా రంగంలో కనిపించని చీకటి కోణాలు ఉంటాయి. ఇటీవల మహిళను వేధించి ఓ సినీ నిర్మాత అరెస్టు అయ్యాడు. అదే కోవలో మరో సినీ నిర్మాత ఓ మహిళను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇది తట్టుకోలేని ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు సీరియల్స్ లో రమేశ్వరి అలియాస్ భైరవి నటిస్తుంటారు. ఆమెకు వేలూరుకు చెందిన రాజాదేసింగ్ అలియాస్ సుబ్రమణి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనను తాను సినీ నిర్మాతగా అతడు పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడ్డాక పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో బాధితురాలు భైరవి ఓకే చెప్పింది. షూటింగ్ ఉందని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ గుడిలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక ఆ తర్వాత నుంచి తనకు అతడి నిజస్వరూపం తెలిసిందని భైరవి ఆరోపిస్తోంది. తనను వ్యభిచారం చేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. తనకు వేధింపులు తీవ్రం అవడం, పోలీసుల నుంచి తగిన స్పందన లేకపోవడంతో చెన్నైలోని డీజీపీ కార్యాలయం ఎదుట సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో అక్కడ ఉన్న పోలీసులు అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు.