వైద్య నిపుణులు హెచ్చరిక
కండ్ల కలకకు స్టెరాయిడ్ చుక్కల మందు వద్దు
ఆంజనేయులు న్యూస్, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కండ్ల కలక తీవ్రంగా వ్యాపిస్తోంది. దీన్ని వైద్య పరిభాషలో కంజెక్టివైటిస్, ఐ ఫ్లూ అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధులకు నేత్ర వైద్యుల సిఫార్సు లేకుండా ప్రజలే సొంతగా స్టెరాయిడ్ కంటి చుక్కలు వాడితే తాత్కాలికంగా ఉపశమనం కలిగినా దీర్ఘకాలంలో హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంజెక్టివైటిస్ ఎలాంటి మందులు లేకుండా దానంతట అదే ఒకటీ రెండు వారాల్లో తగ్గిపోతుందని, ఎడినో వైరస్ వల్ల వచ్చిన కండ్ల కలకకు మాత్రమే స్టెరాయిడ్ చుక్కలు వాడాలని సీనియర్ నేత్ర వైద్యుడు డాక్టర్ జె.ఎస్.భల్లా తెలిపారు. ఇతరులు ఆ చుక్కలను వాడితే వ్యాధిని పొడిగించడమే అవుతుందన్నారు. 20 శాతం నుంచి 30 శాతం మందిలో ఎడినో వైరస్ వల్ల కాకుండా బ్యాక్టీరియా వల్ల కండ్ల కలక వస్తోందని, వారు మాత్రమే యాంటీ బయాటిక్స్ వాడాలని ఏఐఎంఎస్ డాక్టర్ జెఎస్ టిటియల్ చెప్పారు. కొంతమందికి వైరస్ వల్ల కండ్ల కలక వచ్చి, ఆపైన బ్యాక్టీరియా సోకుతుందనీ, అలాంటివారు యాంటీ బయాటిక్ చుక్కలు వాడవచ్చన్నారు. వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్ కంటి చుక్కలు దీర్ఘకాలం వాడితే కంటిలో ఒత్తిడి పెరిగి గ్లకోమా వచ్చే ప్రమాదం ఎక్కువని ఆయన హెచ్చరించారు. కండ్లకలక వచ్చినవారు నల్ల కళ్లద్దాలు ధరించడం, చేతులు, ముఖం శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేయాలని సూచించారు.