Telugu Updates
Logo
Natyam ad

కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. భారత ఔషధ సంస్థలో అర్ధరాత్రి తనిఖీలు

భారత్ లో తయారైన కంటి చుక్కల మందు వాడకంతో అమెరికాలో పలువురికి కంటి చూపు మందగించింది. ఒక మరణం సంభవించింది. ఈ క్రమంలో చెన్నైకి చెందిన ఔషధ సంస్థపై తనిఖీలు జరిగాయి.

ఆంజనేయులు న్యూస్, చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై లో తయారైన కంటి చుక్కల మందు వల్ల అమెరికాలో మరణం సంభవించడంతో ఔషధ నియంత్రణ సంస్థ చర్యలకు ఉపక్రమించింది. గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ సంస్థపై అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించింది. అమెరికాకు పంపిన బ్యాచ్ లకు చెందిన నమూనాలను సేకరించింది. భారత్ కు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కెర్ ప్రైవేటు లిమిటెడ్ తయారు చేసిన ఎజీకేర్ కంటి చుక్కల మందు కారణంగా అమెరికా లో పలువురికి కంటిచూపు మందగించడమే గాక.. ఓ మరణం కూడా సంభవించింది. దీంతో ఆ మందుపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. దాంతో అమెరికా విపణి నుంచి ఆ కంటి చుక్కల మందును రీకాల్ చేసుకుంటున్నట్లు ఇప్పటికే సంస్థ వెల్లడించింది.

ఈ క్రమంలో కేంద్రం, తమిళనాడుకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థ బృందం గ్లోబల్ ఫార్మాలో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టింది. ‘యూఎస్ కు పంపిన బ్యాచ్లకు చెందిన నమూనాలను, అలాగే అందులో వాడిన ముడిపదార్థాల నమూనాలను సేకరించాం. అంతేగాకుండా యూఎస్ లో ఇంకా ఓపెన్ చేయని చుక్కల మందు నమూనాల కోసం చూస్తున్నాం.. ప్రస్తుతానికి దీనిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక  అందించాం’ అని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చుక్కల మందు తయారీపై సస్పెన్షన్ విధించారు. కాగా, ఈ ఔషధం తయారీ, ఎగుమతి విషయంలో గ్లోబల్ సంస్థకు చెల్లుబాటయ్యే లైసెన్స్ ఉందని తెలిపారు. ఎజీకేర్ కంటి చుక్కల కారణంగా 12 రాష్ట్రాల్లో కనీసం 55 మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని అమెరికా రెండురోజుల క్రితం ప్రజలను హెచ్చరించింది. ఇందులో ఒకరు ఇన్ఫెక్షన్ కారణంగా మరణించగా.. మరో ఐదుగురికి కంటిచూపు పోయిందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC)అధికార ప్రతినిధి చెప్పారు. “న్యూయార్క్, వాషింగ్ టౌన్ తో పాటు మరో 10రాష్ట్రాల్లో పలువురు కంటి చుక్కలు వేసుకున్న తర్వాత బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్ కనిపించింది” అని సీడీసీ తెలిపింది.

ఈ క్రమంలోనే ఎజ్రికేర్, డెల్సామ్ కంటి చుక్కల కొనుగోళ్లు, వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, వైద్యులు, వినియోగదారులను హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. “ఎజ్రేకేర్, ఎల్ఎల్సీ, డెల్సామ్ ఫార్మా పంపిణీ చేసిన ఆర్టిఫిషియల్ టియర్స్ లూబ్రికాంట్ కంటి చుక్కల మందు సీసాలను మార్కెట్ నుంచి స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నాం”అని చెప్పింది. కొద్దినెలల క్రితం మన దేశానికి చెందిన దగ్గు మందు కారణంగా గాంబియా, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో మరణాలు సంభవించాయి. ఆ ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఇంతలోనే ఈ కంటి చుక్కలమందు ఘటన వెలుగులోకి వచ్చింది.