మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వార్షిక రుణ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎ.జి.ఎం. మహ్మద్ జయూర్ రహమాన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎ.జి.ఎం. రాధాకృష్ణన్, నాబార్డ్ డి.డి.ఎం. అబ్దుల్ రవూఫ్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి. మురళీమోహన్రావు, టి.జి.బి. ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ ప్రభుదాస్ లతో కలిసి వివిధ బ్యాంకుల అధికారులతో రుణ లక్ష్యసాధనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరంలో జూన్-2024 వరకు వంట రుణం క్రింద 525 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగానికి 796 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 262 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణ రుణాల లక్ష్యం 91.32 కోట్ల రూపాయలు, విద్యా రుణాలు 7.06 కోట్ల రూపాయలు, వివిధ రంగాల రుణాల లక్ష్యం మొత్తం 291 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ముద్ర రుణాల క్రింద 4 వేల 487 మందికి 41.77 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని, 1 వేల 739 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు గాను 174 కోట్ల రూపాయలు, వ్యవసాయ ధీర్ఘకాలిక రుణాల లక్ష్యం 442 కోట్ల రూపాయలు సాధించడం జరిగిందని తెలిపారు. పి.ఎం.ఎఫ్.ఎం.ఈ. పథకం క్రింద 314 యూనిట్లకు రుణ సదుపాయం కల్పించడం జరిగిందని, ప్రధానమంత్రి స్వనిధి పథకం క్రింద మొదటి విడతలో 16 వేల 903 యూనిట్లు, 2వ విడతలో 9 వేల 360 యూనిట్లు, 3వ విడతలో 1 వేయి 660 యూనిట్లకు రుణాలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 48 ప్రాజెక్టుల లక్ష్యంకు గాను 11 ప్రాజెక్టులకు రాయితీ రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి జనధన్ పథకం క్రింద 2 లక్షల 89 వేల 22 మందికి ఖాతాలు తెరువడం జరిగిందని, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన పథకం క్రింద 99 వేల 418 మందికి, ప్రధానమంత్రి సరక్షా భీమా యోజనలో 2 లక్షల 69 వేల 934 మందికి, అటల్ పెన్షన్ యోజన పథకం క్రింద 38 వేల 887 మందికి లబ్ది చేకూరిందని, రైతు రుణమాఫీ పథకం 3వ విడతలలో 56 వేల మంది లబ్దిదారులకు 465 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, 40 వేల మంది 324 కోట్ల రూపాయలు వినియోగించుకున్నారని తెలిపారు.
మంచిర్యాల జిల్లాకు చెందిన 63 మందికి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల ద్వారా శిక్షణ అందించడం జరిగిందని తెలిపారు. రైతులు, వ్యాపారస్తులు, ఎస్.సి., ఎస్.టి. కార్పొరేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పథకాల కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. వ్యవసాయ సాగుకు సంబంధించి రుణాలు పొందిన రైతులు సకాలంలో తిరిగి చెల్లించి అవసరమైన నూతన రుణాలు పొందేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రుణ ప్రణాళిక లక్ష్యాలను సాధించే విధంగా బ్యాంక్ అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.