Telugu Updates
Logo
Natyam ad

అభివృద్ధిని ఓర్వలేక మాజీ ఎమ్మెల్సీ అసత్య ప్రచారాలు..?

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో 20 వేల ఓట్ల ఆధిక్యంతో గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన మాజీ ఎమ్మెల్సీ దానిపై స్పందించకుండా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. జిల్లాలో 500 కోట్లతో మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రైల్వే అండర్ బ్రిడ్జి, సింగరేణి ప్రాంతంలో పట్టాల పంపిణీ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేసి ప్రజల వైపు నిలబడితే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు దోపిడి కబ్జాల వైపు నిలబడ్డాడని విమర్శించారు. గోదావరి నదీ తీరం వద్ద ప్రజల అభీష్టం మేరకే వైకుంఠధామం నిర్మించి, మరికొన్ని నిధులు వెచ్చించి చేస్తామన్నారు. బెదిరింపులతో రాజకీయం చేసే ప్రేమ్ సాగర్ రావు తనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాగజ్ నగర్, మంచిర్యాల ప్రజల విశ్వాసం కోల్పోయిన మాజీ ఎమ్మెల్సీ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.