మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: వాతావరణ శాఖ సూచన మేరకు వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి రక్షణ చర్యలతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహశిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు ఇతరత్రా అధికారులు వారి పరిధిలో అందుబాటులో ఉండాలని, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువులు, కుంటల స్థితులను పర్యవేక్షించాలని, వరద నీరు చేరి చెరువులు గండి పడే పరిస్థితి తలెత్తినప్పుడు వాటిని అదుపు చేసేందుకు అవసరమైన చర్యలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.
గ్రామాలలో ప్రజాప్రతినిధుల సమన్వయంతో వరద నీటిని అదుపు చేసేందుకు ప్రజలను అప్రమత్తం చేయాలని, వరద నీరు నిండి ప్రవహించే చెరువుల వివరాలు పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారుల వద్ద ఉ న్నట్లయితే తక్షణ చర్యలు తీసుకునేందుకు సులభతరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితులలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తప్పనిసరిగా వారి హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉండాలని, సెలవులు రద్దు చేయడం జరిగిందని, రెండు రోజులు సెలవులు ఉన్నందున ఎవరైనా వెళ్ళినట్లయితే వారిని తిరిగి పిలిపించాలని, సరైన సమాచారం అందించకుండా అధికారులు వెళ్ళినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వరద నీరు చేరుతున్నప్పుడు ముందు జాగ్రత్తలు చేపట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆస్తి, ప్రాణ నష్టాన్ని నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలని, వరదలలో ఎవరైనా ఇరుక్కున్నట్లయితే వారిని రక్షించేందుకు అవసరమైన తక్షణ చర్యలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.
జిల్లాలో ఉన్న ప్రాజెక్టులలోకి చేరుతున్న వరద నీటి స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని, అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పని చేస్తుందని తెలిపారు. వరద పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు నిరంతరం సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అత్యవసర సేవల నిమిత్తం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, సేవల నిమిత్తం 08736-250500, 250501, 250502, 250504 నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.