విషాదం… ముగ్గురు విద్యార్థుల మృతి..!
జగిత్యాల జిల్లా: ధర్మపురి మండలంలో విషాదం చోటు చేసుకుంది. తుమ్మెనాల గ్రామంలోని చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ ఉదయం గొలుసుల యశ్వంత్(13), మారంపల్లి శరత్ (14), పబ్బతి నవదీప్ (10)లు చెరువులో ఈతకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ నీటిలో మునిగిపోయి చనిపోయారు. స్థానికులు మొదట యశ్వంత్ మృతదేహాన్ని గుర్తించారు. కొద్ది సేపటి తర్వాత మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలాన్ని సీఐ కోటేశ్వర్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యశ్వంత్ కుటుంబం నల్గొండ జిల్లాకు చెందినది కాగా కొద్ది సంవత్సరాలుగా తుమ్మెనాలలో నివాసముంటూ బావుల్లో పూడిక తీసే పనులు చేస్తున్నారు. శరత్, నవదీప్ తుమ్మెనాలకు చెందినవారే…