Telugu Updates
Logo
Natyam ad

వివాదంలో జిల్లా కలెక్టర్..!

నిర్మల్ జిల్లా: తెలంగాణలోని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటే బంతులు అందించేందుకు 21 మంది వీఆర్ఎలకు డ్యూటీ వేస్తూ ఆ జిల్లాలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిర్మల్ తహసీల్దార్ శివప్రసాద్ కలెక్టర్ 21 మంది వీఆర్ఎల పేర్లను టెన్నిస్ హెల్పర్లుగా ప్రస్తావిస్తూ ఓ లిస్ట్ ను విడుదల చేశారు. ఈ లిస్ట్ లోని 21 మంది వీఆర్ఎలలో రోజూ ముగ్గురు చొప్పున సాయంత్రం వేళల్లో కలెక్టర్ నివాసంలోని టెన్నిస్ గ్రౌండ్ వద్ద బంతులు అందించే విధులకు హాజరు కావాలట. ఈ లిస్ట్ మీడియాకు చిక్కడంతో ఒక్కసారిగా కలెక్టర్ పై వివాదం రేగింది..
అయితే ఈ వివాదంపై కలెక్టర్ ముషరఫ్ అలీ తాజాగా స్పందించారు. తన దృష్టికి ఈ విషయం రాలేదని అన్నారు. వీఆర్ఎలకు టెన్నిస్ బంతులు అందించే బాధ్యతలు అప్పగిస్తూ తహసీల్దార్ విడుదల చేసిన లిస్ట్ ను చూసి తాను మాట్లాడతానని చెప్పారు. నిర్మల్ లో ప్రారంభమైన తొలి టెన్నిస్ స్టేడియం ఇదేనని, ఇందులో ఎవరైనా ఆడుకునేందుకు వచ్చే వీలుందని అలీ అన్నారు. ఈ క్రమంలోనే వీఆర్ఎ్పలు వచ్చి ఉంటారేమోనని ఆయన అన్నారు. ఇతర శాఖల అధికారులు, సామాన్య ప్రజలు కూడా ఈ కోర్టులో ఆడుకునే వీలుందన్నారు. ఇక వీఆర్ఎలకు విధుల విషయంలో జరిగిన వ్యవహారాన్ని పరిశీలించాక, అవసరమనుకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఈ తరహా వ్యవహారాలపై ఉన్నతాధికారుల వేధింపులు ఉన్నట్టయితే తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.