హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా ఈనెల 27న జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానాలు అందిన ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరుకావాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మిగతా శ్రేణులు ఆరోజు గ్రామాలు, పట్టణాల్లో తెరాస జెండాలు ఆవిష్కరించాలని కోరారు. తెరాస ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి కేటీఆర్ పరిశీలించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… “తెరాస ఏర్పడి 21 ఏళ్లు అయింది. హెచ్ఐసీసీలో ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రజాప్రతినిధులు, మహాసభకు 3వేల మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నాం. వారందరికీ పాసులు జారీ చేస్తాం. మిగతా వారంతా గ్రామాలు, పట్టణాల్లో సంబురాలు జరుపుకోవాలి. 3,600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలి. తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా తెరాస ఆవిర్భవించింది. ఈ వేడుకలను శ్రేణులంతా పెద్దఎత్తున జరుపుకోవాలి” అని కేటీఆర్ తెలిపారు. ఆవిర్భావ వేడుకలకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ పరిధిలోని నాయకులతో సమావేశం కానున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.