ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చెన్నూరులో జోన్ల ఏర్పాటు కాకపోవడంతో పట్టణంలోని జగన్నాథస్వామి ఆలయం ముందు ఇలా ప్రధాన మార్గాల్లోని రహదారులపైనే కూరగాయల విక్రయాలు సాగిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాల, అంబేడ్కర్ చౌరస్తా, ఒడ్డెర కాలనీల్లో జోన్లను గుర్తించి షెడ్ల నిర్మాణం చేపట్టారు. అద్దె నిర్ణయించి చిరు వ్యాపారులకు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నిరుపయోగంగా మారాయి.
పురపాలికల్లో వీధి వ్యాపారాల జోన్ల ఏర్పాటుకు అడుగులు మందుకు పడటం లేదు. ఏటా సర్వే జరుపుతున్నా ఈ ప్రక్రియ అమలుకు నోచుకోకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిరు వ్యాపారాలు ఎక్కడపడితే అక్కడ రోడ్లపై, కూడళ్లలో వ్యాపారాలు కొనసాగిస్తుండటంతో పాదచారులకు, వాహన చోదకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రధాన రహదారులు, కూడళ్లు, అంతర్గత రహదారుల పొడవునా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం మున్సిపాలిటీల్లో జోన్ల ఏర్పాటు పద్ధతికి శ్రీకారం చుట్టింది. దీనిపై ఇదివరకే జిల్లా కేంద్రంతోపాటు ప్రధాన పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యంలో సీసీలు, ఆర్పీలు సర్వే చేశారు. ఆయా ప్రాంతాల్లో వీధి వ్యాపారులను గుర్తించారు. వీరంతా ఏ ఏ ప్రధాన రహదారుల్లో కూడళ్లలో, అంతర్గత రహదారుల్లో వ్యాపారం కొనసాగిస్తున్నారో, ఫలితంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయో సర్వే చేపట్టి దాని ఆధారంగా జోన్లను గుర్తించారు. పట్టణాల్లో జోన్ల ఏర్పాటుకు సంబంధించిన సర్వే నివేదికను ఆయా పురపాలక సంఘాలు అయిదేళ్ల కిందటే రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలన విభాగానికి పంపించినా ఇంతవరకు జోన్ల అమలుకు గెజిట్ విడుదల కాలేదు.
• ఇక్కడ.. ఇలా..
మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో షెడ్లను నిర్మించినప్పటికీ వ్యాపారులకు వాటిని కేటాయించలేదు. బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల కొందరికి కేటాయించినా మరికొన్ని షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఇక సింగరేణి ప్రాంతాలైన నస్పూరు, క్యాతన్పల్లి, మందమర్రి పట్టణాల్లో స్థల సమస్య ఉండగా ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ఇక చెన్నూరులో రూ.8 లక్షలు వెచ్చించినా స్థల వివాదం కారణంగా నిరుపయోగమయ్యాయి.
• మూడు రకాలుగా జోన్లు
గ్రీన్ జోన్ : ట్రాఫిక్ అంతరాయం కలగని ప్రదేశాలను గ్రీన్ జోన్లుగా పరిగణిస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపారాలు కొనసాగించాల్సి ఉంటుంది.
అంబర్ జోన్ : ఓ మోస్తారు నుంచి మధ్యస్తంగా జనం రద్దీ ఉండే ప్రధాన అంతర్గత రహదారులు, కూడళ్లను అంబర్ జోన్ ప్రాంతాలుగా నిర్దేశిస్తారు. ఇక్కడ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు వ్యాపారాలు కొనసాగించుకోవాలి.
రెడోజోన్ : వాహనాలు, పాదచారుల రాకపోకలతో ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాలను రెడ్ జోన్లుగా పరిగణిస్తారు. ఇక్కడ ఎలాంటి వీధి వ్యాపారాలు కొనసాగించొద్దు.